FrenchOpen2026 | నేటి నుంచే.. ఫ్రెంచ్ ఓపెన్

FrenchOpen2026 | నేటి నుంచే.. ఫ్రెంచ్ ఓపెన్
FrenchOpen2026 | అందరి దృష్టి సినెర్ పైనే
టైటిల్ పై కన్నేసిన సబలెంకా
బరిలోకి దిగుతున్న జొకొవిచ్
FrenchOpen2026 | స్పార్స్ట్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు నేటితో తెర లేవనుంది. పురుషుల, మహిళల విభాగాల్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ మణికట్టు గాయంతో టోర్నీనుంచి తప్పుకోగా, వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)పై అందరి దృష్టీ నిలిచింది. వరుసగా మాస్టర్స్ 1000 టోర్నీలు గెలిచి రికార్డులతో దూసుకుపోతున్న సినెర్‌ను నిలువరించడం అంత సులువు కాదు.
ఇతర మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలిచిన సినెర్… ఫ్రెంచ్ ఓపెన్ ను కూడా సాధించి కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘ కాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న జొకోవిచ్ (సెర్బియా) మరోసారి పోరాటానికి సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో కూడా పోటీ తీవ్రంగా ఉంది. వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా తన తొలి ఫ్రెంచ్ టైటిల్‌ను సాధించాలని పట్టుదలగా ఉండగా…నాలుగు సార్లు రోలండ్ గారోస్‌లో విజేతగా నిలిచిన స్వియాటెక్ ఐదో టైటిల్ వేటలో నిలిచింది. గాఫ్, ఒసాకా, కీస్, పెగులా సత్తా చాటేందుకు సై అంటున్నారు.
అసంతృప్తుల మధ్య..
ఇది ఇలా ఉంటే సీజన్‌లో రెండో మేజర్ టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్ల చెల్లింపులకు సంబంధించి తీవ్ర వివాదానికి కారణమైంది. సినెర్, సబలెంకా, గాఫ్‌వంటి అగ్రశ్రేణి ప్లేయర్లు ఇప్పటికే తమ వాటా కోరుతూ అసంతృప్తిని ప్రదర్శించారు. ఒక దశలో బాయ్‌కాట్ పిలుపు వినిపించినా అది సద్దుమణిగింది. ప్రస్తుతం టోర్నీ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.
