సమస్యల పరిష్కారానికి వేదిక..

సమస్యల పరిష్కారానికి వేదిక..

పీజీఆర్ఎస్‌కు హాజరుపై కలెక్టర్ సూచనలు..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

అదేవిధంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సంబంధిత ఆధార పత్రాలతో సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

అర్జీల స్వీకరణ, పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని, అలాగే అర్జీల స్థితి కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

వేసవి తీవ్రత దృష్ట్యా పీజీఆర్ఎస్‌కు హాజరయ్యే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేని వారిని కేంద్రాలకు తీసుకురావద్దని ఆమె తెలిపారు.

అలాంటి వారి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్రతినిధుల ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

పీజీఆర్ఎస్ కేంద్రాల్లో తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి సౌకర్యాలు, అలాగే వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందిన అర్జీలపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply