ప్రజల సమస్యలకు వేదిక సిద్ధం..

ప్రజల సమస్యలకు వేదిక సిద్ధం..
సమయ మార్పుతో ప్రత్యేక నిర్వహణ..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 25వ తేదీ సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండల కార్యాలయాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడనుంది.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమ సమయాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను నేరుగా సమర్పించవచ్చని, అలాగే మీకోసం.ఏపీ.గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
దాఖలు చేసిన అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్‌సైట్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
ముందుగా మండల, డివిజన్ లేదా మున్సిపల్ స్థాయి కార్యాలయాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని, అక్కడ పరిష్కారం కాని అంశాలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
