Ramchander Rao | గోదావరి ప్రాజెక్టుల అమలులో నిర్లక్ష్యం..

Ramchander Rao | గోదావరి ప్రాజెక్టుల అమలులో నిర్లక్ష్యం..
కాలేశ్వరం పునరుద్ధరణలో వైఫల్యం
సీతారామ సాగర్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులపై విమర్శలు
తెలంగాణ జలాల పరిరక్షణపై హెచ్చరిక
Ramchander Rao | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణకు గోదావరి జలాల వినియోగంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి నదిపై 360 టీఎంసీల నీటి ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు.
కాలేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దాని కారణంగా రాష్ట్రానికి సుమారు 200 టీఎంసీల నీటి నష్టం జరుగుతోందని రామచంద్రరావు ఆరోపించారు. అన్ని అనుమతులు పొందిన సీతారామ సాగర్ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని విమర్శించారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
గోదావరి నదిపై చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, లేకపోతే తెలంగాణకు కేటాయించిన జలాలు వృథాగా పోతాయని రామచంద్రరావు హెచ్చరించారు.
