మండే ఎండల్లో ముంజలకే మక్కువ

తొర్రూరు, ఆంధ్రప్రభ ; మండే ఎండల్లో వేసవి తాపాన్ని తగ్గించేందుకు ప్రజలు తాటి ముంజలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి ప్రసాదమైన తాటి ముంజలను విక్రయిస్తూ గీతా కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన గీతా కార్మికులు తాటి చెట్లపై నుంచి ముంజకాయలను కోసి తొర్రూరు పట్టణానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వినియోగదారుల ముందే తాటికాయలను కోసి ముంజలు తీసి ఇస్తుండటంతో స్థానికులు వాటిని ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం డజన్ ముంజలను రూ.100కు విక్రయిస్తున్నారు. ముంజల్లో సుమారు 90 శాతం నీరు ఉండటంతో వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయని ప్రజలు చెబుతున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో తాటి వనాలు అధికంగా ఉండటంతో గీతా కార్మికులు తాటి ముంజలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వేసవిలో శీతల పానీయాల కంటే తాటి ముంజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
