India Bangladesh Relations | భారత్-బంగ్లా సంబంధాలపై తాజా పరిణామాలు

India Bangladesh Relations | భారత్-బంగ్లా సంబంధాలపై తాజా పరిణామాలు
India Bangladesh Relations | తీస్తా జలాల ఒప్పందంపై బంగ్లాదేశ్ ఆశలు
మమతా బెనర్జీ అడ్డంకులు మరియు రాజకీయ ప్రభావం
సరిహద్దు ఫెన్సింగ్‌పై పెరుగుతున్న ఆందోళనలు
బుల్డోజింగ్ చర్యలపై ముస్లిం వర్గాల నిరసనలు
పశువుల వ్యాపార ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితులు
India Bangladesh Relations | పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తప్పించడంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పాత్ర ఉంది. భారత్-బంగ్లాల మధ్య మూడు దశాబ్దాల క్రితం కుదిరిన తీస్తా నదీజలాల ఒప్పందం కాలపరిమితి ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది. అప్పట్లో బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధికారంలో ఉండేది. ఇరు దేశాల సంబంధాలు కొత్త ఒప్పందం మీద ఆధారపడి ఉంటాయని బంగ్లాదేశ్ అప్పట్లో వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కొత్త ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావాలనీ, బంగ్లాదేశ్ ప్రజలు కోరుతున్నారని బీఎన్పీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మంత్రి మీర్జా ఫక్రూల్ ఇస్లామ్ ఆలంగీర్ తెలిపారు. తీస్తా జలాల పంపిణీ ఒప్పందం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో సంతకాల దశకు చేరింది. అప్పట్లో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డింది. తీస్తా జలాలు లేకపోతే బెంగాల్ ఉత్తర ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోతాయని పశ్చిమ బెంగాల్ అప్పట్లో వాదించింది.
2011లో కుదిరిన తీస్తా జలాల ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖల్లిలూర్ రెహమాన్ ప్రస్తుతం ఈ ఒప్పందం కుదుర్చుకునే నాటి పరిస్థితులే ఉన్నాయని, మళ్లీ ఒప్పందం కుదరకపోతే బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుందని అన్నారు. కాగా, బంగ్లాదేశ్ జర్నలిస్టు జుబెన్ నెసా అలూ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఆవిర్భావం నాడే తీస్తా జలాల ఒప్పందం కుదరుతుందని బంగ్లాదేశ్ ప్రజలు ఎంతో ఆశపడ్డారని, అది అమలులోకి వచ్చిన తర్వాత ఎంతో సంతోషించారని అన్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల 14 ఏళ్ల పాటు అమలు జరగలేదని ఆయన అన్నారు.

ఇప్పుడు కేంద్రంలోనూ, పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉండటం వల్ల ఈ ఒప్పందం అమలు జరుగుతుందో లేదోనని బంగ్లాదేశ్ ఆందోళన చెందుతోంది. ఇరు దేశాల మధ్య ఫెన్సింగ్ పనులు వేగవంతం చేయడానికి 45 రోజుల్లో అవసరమైన భూమిని అప్పగించేందుకు బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కావాలని ఆదేశించారు. ఈ పనుల సందర్భంగా బంగ్లాదేశ్ వైపున పలువురు మరణిస్తారేమోనన్న భయం వెంటాడుతోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనధికార ఆక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమై ఉంది. ఈ పనులు మే 19వ తేదీన ప్రారంభమయ్యాయని, అవి వేగంగా జరుగుతున్నాయని బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ తెలిపారు.
అయితే, సువేందు అధికారి ప్రభుత్వం చేపట్టిన బుల్డోజింగ్ వల్ల ముస్లిం వర్గాలు ఆందోళనలు చేపట్టవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ఆంగ్ల పత్రిక ‘ప్రోథోమ్ అలో’ ఈ బుల్డోజింగ్పై ఒక వ్యాసం ప్రచురించింది. కోల్‌కతా దక్షిణ ప్రాంతంలో అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఈ ప్రాంతంలో చట్టబద్ధంగా కట్టిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయని ఆ పత్రిక పేర్కొంది. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. ఈ ఘటనకు నిరసన తెలియజేస్తూ వారు ప్రదర్శనలు నిర్వహించారు.
అంతేకాక, ఈద్ అల్-అధా త్వరలో జరగనున్నందున పశ్చిమ బెంగాల్లో పశువుల వ్యాపారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పద్నాలుగు సంవత్సరాల లోపు వయసున్న పశువులను వధించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాక, పశుగణ శాఖ నుంచి ముందుగా ఒక అభ్యర్థన పత్రం రావాలని ఆంక్ష విధించింది. దీంతో కోల్‌కతాలో బీఫ్‌తో తయారు చేసిన తినుబండారాల కొరత ఏర్పడింది.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో మైనారిటీ వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో భారత్ వ్యతిరేక భావజాలం పెచ్చరిల్లుతోంది. నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు నసిరుద్దీన్ పటోవారీ ఒక సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. మైనారిటీలు, ముఖ్యంగా బంగ్లాదేశీయులు అల్లాకి తప్ప ఎవరికీ భయపడబోరని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందువులపై దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడవచ్చని ఆశించారు. కానీ, ఈ పరిణామాలు మళ్లీ ఎటువంటి పరిస్థితికి దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దగలవో చూడాలి.
దీప్ హాల్దర్ @deepscribble
రచయిత, ప్రింట్ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్
