ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణం

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణం
వేసవి, వారాంతపు సెలవులతో దుర్గగుడికి పోటెత్తిన భక్తులు
ఆంధ్రప్రభ – ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ ఆలయాన్ని సందర్శించి భక్తుల రద్దీని ప్రత్యక్షంగా పరిశీలించారు. క్యూలైన్లతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

సాయంత్రం నిర్వహించిన పల్లకీ సేవ భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. శ్రీ స్వామివారు, అమ్మవారికి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పల్లకీ సేవలో చైర్మన్ బొర్రా గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తి గీతాలు, జైజైధ్వానాలతో మారుమోగగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
