మంచుగడ్డ పై మైనపు బొమ్మ
- స్కేటింగ్ క్రీడాకారిణి చైత్ర దీపికను అభినందించిన ఎమ్మెల్యే సుజన చౌదరి..
భవానిపురం, ఆంధ్రప్రభ : నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పెదిరెడ్ల చైత్ర దీపిక ను ఎమ్మెల్యే సుజన చౌదరి అభినందించి ఆశీస్సులు అందజేశారు. డెహ్రాడూన్ వేదికగా జూన్ 25వ తేదీ నుండి 30వరకు వరకు జరిగిన 21వ నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించి కేటగిరీ-7 విభాగంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
తన అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో రాణించిన చైత్ర దీపిక రాష్ట్రానికి, అలాగే తన జిల్లాకు విశేషమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ విజయంతో ఆమె ఇప్పటివరకు ఆర్టిస్టిక్ స్కేటింగ్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో ఏకంగా 62 పతకాలను సాధించి తన సత్తా చాటింది. ఈ సందర్భంగా ఆదివారం తాడిగడప లోని ఎమ్మెల్యే సుజన చౌదరిను కాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తాను సాధించిన విజయాలను తెలియజేసింది. రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి, రాష్టానికి మంచి పేరు తేవాలని విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని ఎమ్మెల్యే సుజన చౌదరి అభినందించి ఆశీస్సులు అందజేశారు.
