ఆపదలో మహిళలకు ‘శక్తి’ అండ..

ఆపదలో మహిళలకు ‘శక్తి’ అండ..

ఒక్క కాల్‌తో పోలీసులు మీ ముందుకు

అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి: సీఐ సుబ్రహ్మణ్యం

నందికొట్కూరు, మే 23 (ఆంధ్రప్రభ): మహిళల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని, ఆపదలో ఉన్న మహిళలకు ‘శక్తి’ యాప్ అండగా నిలుస్తుందని నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం అన్నారు.

నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ సూచనల మేరకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. టౌన్ అర్బన్ ఎస్సై-2 సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెప్మా అధికారిణి ప్రమీలమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆశీర్వాదమ్మతో పాటు పొదుపు సంఘాల మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, మహిళా లీడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలకు శక్తి యాప్‌పై పూర్తి అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.

సమాజంలో ఎవరైనా మహిళలతో అసభ్యంగా లేదా దురుసుగా ప్రవర్తిస్తే భయపడవద్దని, వెంటనే 112 లేదా 100 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. అలాగే శక్తి యాప్ హెల్ప్‌లైన్ నంబర్ 7993485111ను అవసరమైనప్పుడు వినియోగించుకోవాలని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారని భరోసా ఇచ్చారు.

బాల్యవివాహాలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, మహిళా సంక్షేమం కోసం 181 వుమన్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వన్ స్టాప్ సెంటర్ ప్రాముఖ్యత, శక్తి టీమ్‌ల పనితీరుపై కూడా వివరించారు.

గ్రామ గ్రామానికి శక్తి యాప్‌పై అవగాహన తీసుకెళ్లడం ప్రతి మహిళా సంఘ నాయకురాలు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్ బాధ్యత అని సీఐ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరితో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించారు.

Leave a Reply