రెవెన్యూ–ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ప్రాజెక్టులు వేగవంతం,

రెవెన్యూ–ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ప్రాజెక్టులు వేగవంతం,

భూ సేకరణ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి,
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలో అమలవుతున్న ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రాజెక్టుల ఇంజినీర్లు, అదనపు కలెక్టర్ అమరేందర్ తో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతి ప్రాజెక్టు వారీగా వివరాలు ఆరా తీశారు. ఏ ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరం, ఇప్పటివరకు ఎంత భూమి సేకరించబడింది, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉంది అనే అంశాలపై పూర్తి గణాంకాలతో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణలో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలు, రైతుల అభ్యంతరాలు, కోర్టు కేసులు, పరిహారం చెల్లింపుల స్థితి వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…., రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా పనులు వేగవంతం చేయాలని, భూ సేకరణ అనేది ఏ ప్రాజెక్టు పురోగతికైనా కీలకమైన దశ అని,
భూ సేకరణ దశలో చిన్నపాటి ఆలస్యం జరిగినా మొత్తం ప్రాజెక్టు పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు.
అందుకే ప్రతి మండల స్థాయిలో ప్రత్యేక సమన్వయ బృందాలను ఏర్పాటు చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ ఆర్డీవో లకు సూచించారు. రైతులతో సానుకూల చర్చల ద్వారా భూసేకరణను వేగవంతం చేయాలని, వారికి చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ప్రాజెక్టుల పురోగతిని మరింత వేగవంతం చేయడానికి రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వారం పురోగతి నివేదికలు సమర్పించాలని, పెండింగ్ సమస్యలను స్థాయివారీగా సమీక్షించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో వేలాది ఎకరాల భూమికి సాగునీరు అందుబాటులోకి వచ్చి వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖల ఎస్సీలు పార్థసారథి, సత్యనారాయణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, ఆర్డీవోలు సురేష్ బాబు , జనార్దన్ రెడ్డి, యాదగిరి బన్సీలాల్ తాహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.