ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

నారాయణపేట కలెక్టర్ ప్రియాంక
ఊట్కూర్, మే 23 (ఆంధ్రప్రభ) : ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచకపోతే కఠిన చర్యలు తప్పవని నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంక హెచ్చరించారు. ఉపాధిహామీఏపీఓనిర్లక్ష్యంవల్ల కూలీలు పనులకు రావడంలేదని కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్ర సమీపంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులనుఉదయం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఊట్కూర్ సమీపంలో చేపడుతున్న ఫీడర్ ఛానెల్ పనుల వద్దకు వెళ్లిన కలెక్టర్ అక్కడ ఉపాధి కూలీలతో మాట్లాడారు.

వేసవి దృష్ట్యా కూలీలు ఉదయం 5:30 వరకు పనికి రావాలని, ఎండ తీవ్రత పెరిగే లోపు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లవచ్చని కూలీలకు ఆమె సూచించారు. రోజుకు ఎంత కూలీ పడుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు కనీస వసతి సదుపాయాలు కల్పించాలని, తాగునీరు తరచూ తీసుకునేలా కూలీలకు చెప్పాలని ఏ పీ వో కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఊట్కూర్ పెద్ద గ్రామ పంచాయతీ అని, ఉపాధి హామీ పనికి కనీసం 150 మంది అయినా ఉండాలని ఏ. పీ.వో ను ఆదేశించారు. మండలంలోని వల్లంపల్లి, బిజ్వార్, నాగిరెడ్డి పల్లి గ్రామాల్లో ఉపాధి పనులలో కూలీల సంఖ్య చాలా తక్కువ ఉందని, సోమవారం నుంచి కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఓ కు సూచించారు.
ఉపాధి హామీ పనులు, కూలీల సంఖ్యా వివరాల రోజువారీ నివేదికను తనకు పంపించాలని కలెక్టర్ డిఆర్డిఏ వెంకట్ రాములు ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఊట్కూర్ మండల కేంద్రానికి మొదటిసారి రావడంతో సర్పంచ్ ఎం. రేణుకభరత్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఊట్కూర్ సర్పంచ్ రేణుకా భరత్, ఉప సర్పంచ్ రమేష్, ఎంపీవో బాలాజీ,ఏ పీవో లక్ష్మీ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్ శివకుమార్,తదితరులు పాల్గొన్నారు.
