prime minister | తెలంగాణ నుంచి ఈటలకు చాన్స్

prime minister | తెలంగాణ నుంచి ఈటలకు చాన్స్
బండి సంజయ్‌కు ప్రమోషన్?
పరిశీలనలో డీకే అరుణ, అరవింద్ పేర్లు
రాబోయే సాధారణ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు
కిషన్‌రెడ్డికి వేరే శాఖ కేటాయిస్తారా?.. పార్టీ పదవి అప్పగిస్తారా
పొలిటికల్ సర్కిళ్లలో సరికొత్త చర్చలు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
prime minister | తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరునంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రాజకీయ వర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది. కేంద్రంలో మోదీ 3.0 సర్కార్ రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు కేబినెట్ ర్యాంకు ఇస్తారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్, పార్టీ కేడర్‌లో ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని ఆయన పోర్ట్‌ఫోలియోను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసుతో ఆయనను అసలు మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ప్రధాని మోదీ దీనికి భిన్నంగా ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సామాజిక సమీకరణాలే ప్రాధాన్యం..
ఇక.. తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చని బీజేపీ యోచిస్తోంది. ఆయనకు కేబినెట్ లేదా స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం. మహిళా కోటాలో, దక్షిణ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే నేతగా డీకే అరుణ పేరు పరిశీలనలో ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసి వచ్చే అంశం. ఉత్తర తెలంగాణ నుంచి బలమైన వాయిస్ వినిపించే అరవింద్‌ను కూడా ఏదైనా కీలక బాధ్యతల్లోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కిషన్ రెడ్డికి కొత్త బాధ్యతలు?
ప్రస్తుతం బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డికి బాధ్యతల మార్పు ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఆయనను పూర్తిగా పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేస్తారా? లేదా ఇంకా కీలకమైనశాఖను అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందున, ఆయన అనుభవాన్ని ఎక్కడ వినియోగిస్తారనేది ప్రధాని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
రాజకీయ వ్యూహం – 2028 లక్ష్యం
తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మోదీ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. కేబినెట్‌లో చోటు కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో బీజేపీ బలాన్ని పెంచుకోవాలన్నది వ్యూహం. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి కనీసం ముగ్గురు లేదా నలుగురికి అవకాశం దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరోసారి కేంద్ర కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించే అవకాశం లేదు. అందుకే వచ్చే ఎన్నికలకు ఇప్పుడే పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమీకరణాలనులెక్కలోకి తీసుకోనున్నారు.
