కొండ ప్రాంత నివాసితులకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్

కొండ ప్రాంత నివాసితులకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్
- ఎమ్మెల్యే వై. సుజనా చౌదరి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటన
- సిలిండర్ల మోత కష్టాలకు స్వస్తి
- ప్రతి ఇంటికి పీఎన్‌జీ కనెక్షన్‌కు ప్రణాళికలు
భవానిపురం, ఆంధ్రప్రభ:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్‌ను సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలన్న స్థానిక ఎమ్మెల్యే వై. సుజనా చౌదరి ఆదేశాల మేరకు శుక్రవారం ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. కొండప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను తొలగించాలనే సంకల్పంతో, ప్రతి ఇంటికి పైపులైన్ గ్యాస్ (పిఎన్‌జీ) సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ ప్రాజెక్టు అమలులో ఉన్న సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భాగ్యనగర్ గ్యాస్ ధికారులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎస్ఈ ఉదయ్ కుమార్, ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస కుమార్, యరజర్ల మురళి, శేఖర్ తదితరులు కొండ ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల ఇళ్లను, భౌగోళిక పరిస్థితులను పరిశీలించారు.
సిలిండర్ల రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం..
కొండప్రాంతాల్లో నిటారైన మెట్లు, ఇరుకైన దారుల గుండా వంట గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్లడంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రతి ఇంటికి సురక్షితమైన, నాణ్యమైన పైపులైన్ గ్యాస్ కనెక్షన్ కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
త్వరలోనే గ్యాస్ కష్టాలకు స్వస్తి..
భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ పైప్‌లైన్లు వేయడానికి ఉన్న సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, ప్రతినిధుల బృందం నిర్ణయించింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం కొండప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, వారి వంట గ్యాస్ కష్టాలకు త్వరలోనే స్వస్తి పలకబోతున్నామని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
