వాటర్ ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి

వాటర్ ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి
- గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నాణ్యత లేని, కలుషిత తాగునీరు సేవించడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నందున తక్షణం గన్నవరం నియోజకవర్గంలోని ప్రైవేటు, పబ్లిక్ వాటర్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి సదరు ప్లాంట్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని ల్యాబ్ లలో పరీక్షలు చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన యార్లగడ్డ తక్షణం అన్ని వాటర్ ప్లాంట్లను పరిశీలించి నిర్దిష్టమైన నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాంట్లలో ఎప్పటికప్పుడు ఫిల్టర్లు మార్చేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు పాటించని, నిబంధనలు ఉల్లంగించిన ప్లాంట్ల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించటమే లక్ష్యంగా అధికారులు క్రమం తప్పకుండా వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని, తనిఖీల నివేదికను ఉన్నతాధికారులతో పాటు తనకు సమర్పించాలని ఆదేశించారు.
