ఆధునిక భారత శిల్పి రాజీవ్ గాంధీ

ఆధునిక భారత శిల్పి రాజీవ్ గాంధీ
-టెలికాం, కంప్యూటర్ రంగాల పితామహుడు, నవోదయ విద్యాలయాల స్థాపకుడు
-ఆయన వేసిన పునాదులపైనే నేటి నవభారత ప్రగతి
-రాజీవ్‌గాంధీ వర్ధంతిలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్
-ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘన నివాళి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
దేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు నడిపించిన మహోన్నత దార్శనికుడు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక చట్టాలు, దూరదృష్టితో కూడిన విధానాలే నేటి నవభారత ప్రగతికి బలమైన పునాదులని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాలకు చెక్ పెడుతూ 1985లో రాజీవ్‌గాంధీ తెచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని, పారదర్శకతను కాపాడిందని తెలిపారు. అలాగే దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనే నమ్మకంతో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయస్సును 21 నుండి 18 ఏళ్లకు కుదించి, కోట్లాది మంది యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
విద్యారంగాన్ని ఆధునికీకరిస్తూ 1986 జాతీయ విద్యా విధానం ద్వారా గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు ఆయన ‘నవోదయ విద్యాలయాలు’ స్థాపించారని గుర్తుచేశారు. నేడు భారతదేశం ప్రపంచ ఐటీ, టెలికాం రంగాల్లో సూపర్ పవర్‌గా ఎదగడానికి, పల్లెల్లో సైతం సాంకేతికత విస్తరించడానికి ఆనాడే రాజీవ్ వేసిన కంప్యూటర్ సాంకేతిక పునాదులే కారణమన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ, మహిళా రిజర్వేషన్ల ఆలోచనకు ఆయనే శ్రీకారం చుట్టారని, తదనంతర కాలంలో జరిగిన 73, 74 రాజ్యాంగ సవరణలకు అదే మార్గదర్శకమైందని వివరించారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ కౌన్సిలర్లు పడమటి గోపాల్‌రెడ్డి, సంగన్నగారి గోపాల్, మంజలి దస్తగిరి, అల్లంగారి నరసింహారెడ్డి, సంపత్‌రెడ్డి, వెంకటేష్ నాయక్, నారాయణదాసు, మన్నె రాఘవేంద్ర, మణికంఠ, సందీప్‌గౌడ్, లక్డారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ముత్తంగి అశోక్, వెంకటేశ్, మురళి మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
