ప్రజలకు నాణ్యమైన ఇసుక అందించాలి

ప్రజలకు నాణ్యమైన ఇసుక అందించాలి

  • ఈర్లదిన్నె ఇసుక రీచ్‌ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.

సి.బెళగల్, ఆంధ్రప్రభ: ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

గురువారం సి.బెళగల్ మండల పరిధిలోని ఈర్లదిన్నె గ్రామంలోని ఇసుక రీచ్‌ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తుంగభద్ర నదిలో ఇసుక తరలిస్తున్న పడవల్లో ప్రయాణించి, ఇసుక తవ్వకం, రవాణా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇసుక నాణ్యత, నిల్వలు, రవాణా వ్యవస్థపై రీచ్ నిర్వాహకులతో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుకను విచ్చలవిడిగా విక్రయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇసుక కొరత లేకుండా రీచ్‌లను ఏర్పాటు చేసి అందుబాటు ధరల్లో సరఫరా చేస్తోందన్నారు. నిర్మాణ రంగానికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వర్షాకాలంలో తుంగభద్రలో ప్రవాహం పెరగడంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే తగిన నిల్వలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇసుక సరఫరాలో పారదర్శకత పాటించాలని, అక్రమ రవాణా, అధిక ధరల వసూళ్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆర్డీఓ కిడారి సందీప్, తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.