పెద్ద కోనేరు కు రక్షణ వలయాన్ని పటిష్టం చేయాలి
పెద్ద కోనేరు కు రక్షణ వలయాన్ని పటిష్టం చేయాలి
గుంటూరు, ఆంధ్రప్రభ :
గుంటూరు జిల్లా మంగళగిరి పెద్ద కోనేరుకు ఎంతో ప్రఖ్యాతి ఉంది. ఇదే సమయంలో ఇది గతంలో మంగళగిరి సూసైడ్ స్పాట్ గాను పిలువ బడేది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందిన దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా కోనేరు చుట్టూ రక్షణ వలయాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పడమర వైపు కొద్ది భాగం గోడ లేదు. రక్షణ వలయం బలహీన పడటంతో కోనేరులోకి ప్రవేశించే వీలు ఏర్పడి ఆందోళన కలిగిస్తోంది.
ఇక్కడ నిత్యం ప్రజలు తిరుగుతుంటారు. మూగ జీవాలు సంచరిస్తుంటాయి. ఆదమరిచినా పశువులు ప్రమాదవశాత్తు కోనేటిలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం ఓ మహిళ కోనేటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల మరో వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి ఓ వృద్ధ మహిళ కోనేరుకు ఉత్తరం వైపు నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. ఇనుప సువ్వలతో కోనేటి గోడలపై ఏర్పాటైన రక్షణ వలయం ఊడి పోతోంది.
గోడ ఎత్తుగా నిర్మిస్తే…
పెద్దకోనేరుకు రక్షణ గోడను మరో అయిదు అడుగులు అదనంగా నిర్మించడంతో పాటు కోనేరులోకి దిగేందుకు వీలు లేకుండా చర్యలు చేపడితే ప్రమాదం నుంచి తప్పించినట్లు అవుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
