ఆంధ్రకేసరికి ఘన నివాళి
ఆంధ్రకేసరికి ఘన నివాళి
-విజయవాడలో టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి వేడుకలు
-ప్రకాశం పంతులు ఆశయాలే రాష్ట్రానికి మార్గదర్శకం
-వైసీపీ 2.0 అధికారంలోకి రాగానే ‘టంగుటూరి స్మృతివనం’ ఏర్పాటు చేస్తాం
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సేవలను గుర్తు చేసుకున్న వైసీపీ నాయకులు
విజయవాడ, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో బుధవారం ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీసు సమీపంలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టంగుటూరి ప్రకాశం పంతులు పరిపాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని బారిస్టర్ వృత్తిని సైతం పక్కనబెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు టంగుటూరి అని కొనియాడారు.
బ్రిటీష్ పాలకులను ధైర్యంగా ఎదిరించి గర్జించిన నాయకుడిగా ఆయనకు ‘ఆంధ్రకేసరి’ బిరుదు దక్కిందన్నారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో ముందుండి పోరాడిన టంగుటూరి ప్రకాశం పంతులు దేశం కోసం తన ఆస్తి, జీవితం అంకితం చేసిన త్యాగధనుడని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులుపై ప్రస్తుత ప్రభుత్వం సరైన గౌరవం చూపడం లేదని విమర్శించారు.
ఇటీవల ప్రభుత్వం కొందరు మహనీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించేందుకు జీవోలు జారీ చేసినప్పటికీ.. టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయడం గానీ, ఆయన విగ్రహాల స్థాపనపై గానీ చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం, సాగునీటి, సంక్షేమ రంగాల్లో టంగుటూరి చూపిన మార్గంలోనే పాలన సాగించారని గుర్తు చేశారు.
రాబోయే రోజుల్లో వైసీపీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రధాన కూడలిలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహంతో పాటు ఆయన జ్ఞాపకార్థం భవ్యమైన ‘టంగుటూరి స్మృతివనం’ ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. టంగుటూరి ఆశయ సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చంద్రశేఖర్, జొన్నవిత్తుల సుబ్బారావు, దోనేపూడి శ్రీనివాస్, వెన్నం రత్నారావు, మేడేపల్లి ఝాన్సీ, రవిచంద్ర, బంక వెంకటేష్, తాడి శివ, విజయలక్ష్మి, రామిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
