జలవనరుల పరిరక్షణే లక్ష్యం

జలవనరుల పరిరక్షణే లక్ష్యం

వెల్దుర్తిలో పూడికతీత పనులను పరిశీలించిన కలెక్టర్ డా. ఏ. సిరి.
జలధార–జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక పర్యవేక్షణ.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జలవనరుల పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన “జలధార–జలహారతి” 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.బుధవారం వెల్దుర్తి మండలంలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా నాగులవంక లో చేపట్టిన పూడికతీత, పునరుద్ధరణ పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. వాగు, వంకలలో పేరుకుపోయిన పూడిక తొలగింపు ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భూగర్భ జలాల వృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్… నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తయితే వర్షపు నీటి నిల్వకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. జలవనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామస్థులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి జల సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా జలధార–జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. చెరువులు, వాగులు, కాలువలు, వంకల్లో పూడికతీత పనులు వేగవంతంగా చేపడుతూ నీటి నిల్వ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.