కర్నూలు రాజకీయాల్లో మాటల మంటలు.

కర్నూలు రాజకీయాల్లో మాటల మంటలు.

టీజీ భరత్ – బైరెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్‌కు.
ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు..
పోలీస్ కేసులు..
త్రీటౌన్ సీఐపై విమర్శలు.
అధికార – ప్రతిపక్షాల రాజకీయ పోరు.
రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌
“టీజీ కుటుంబం మచ్చలేని రాజకీయాలకు ప్రతీక”
“జోకర్‌లా మాట్లాడుతున్న బైరెడ్డి” అంటూ మంత్రి ఫైర్.
“నన్ను ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక భరత్‌కే ఎక్కువ” అంటూ కౌంటర్.
“పోలీస్ స్టేషన్‌లో కేసుకింత అంటూ బోర్డు పెట్టారు” అంటూ సీఐపై బైరెడ్డి ఆరోపణ.
పరువునష్టం కేసుతో రాజకీయ రగడ మరింత వేడి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు రాజకీయాలు ఒక్కసారిగా అగ్గిపెట్టెలా మారాయి. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య మొదలైన రాజకీయ విమర్శలు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, పోలీస్ కేసులు, పరువు నష్టం వివాదాల దాకా వెళ్లాయి. ఇద్దరు నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం, వారి అనుచరులు కూడా సోషల్ మీడియా వేదికగా యుద్ధరంగం సృష్టించడం, పోలీస్ వ్యవస్థపై కూడా విమర్శలు రావడంతో కర్నూలు రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి టీజీ భరత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. “దశాబ్దాలుగా టీజీ కుటుంబం నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తోంది. రాజకీయాల్లో మా కుటుంబం మచ్చలేనిది. ప్రత్యర్థులకు కూడా మా నిజాయితీ గురించి తెలుసు” అని పేర్కొన్నారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. “నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.

కర్నూలు అభివృద్ధిపై ఫోకస్ పెట్టి పనిచేస్తుంటే, కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రూ.45 కోట్ల అక్రమ వసూళ్లు, అక్రమ ఆస్తులు, ఫ్యాక్షన్ రాజకీయాల ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ.. బైరెడ్డిపై క్రిమినల్, సివిల్ డిఫమేషన్ కేసులు వేస్తానని స్పష్టం చేశారు. ఇక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. “నన్ను ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక నా కన్నా మంత్రి టీజీ భరత్‌కే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది” అంటూ ఎద్దేవా చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న సతీశ్ కుటుంబానికి న్యాయం చేయాలని తాము ధర్నాలు చేస్తే, తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

“సిద్ధార్థరెడ్డిని తిట్టిన వారికి డబ్బులు, సెల్ఫీ వీడియోలు చేసిన వారికి ప్రోత్సాహకాలు, ప్రెస్‌మీట్లు పెట్టిన వారికి కార్పొరేటర్ సీట్లు ఇస్తున్నారు” అంటూ టీజీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా ఎదగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు, కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐపై కూడా బైరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఒత్తిడిలో పనిచేస్తోందని ఆరోపించారు. “పోలీస్ స్టేషన్‌లో ‘కేసుకింత’ అంటూ బోర్డు పెట్టారని” ధ్వజమెత్తుతూ, కేసుల వ్యవహారంలో డబ్బుల రాజకీయాలు నడుస్తున్నాయన్న సంకేతాలు ఇచ్చారు.

బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్రీటౌన్ సీఐపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇక రాజకీయ ప్రస్థానం విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య సవాళ్లు కొనసాగాయి. “48 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యారు.. 50 ఏళ్ల వయసులో ఇప్పుడు నన్ను టికెట్ గురించి అడుగుతున్నారు. మీ వయసుకు వచ్చినప్పుడు నాకు టికెట్ రాకపోతే అప్పుడు అడగండి” అంటూ మంత్రి భరత్‌కు బైరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తాను 33 ఏళ్లకే రాష్ట్ర యువజన నాయకత్వ స్థాయికి చేరుకున్నానని, అనేక మందిని ప్రజాప్రతినిధులుగా గెలిపించానని పేర్కొన్నారు. ఈ మాటల యుద్ధం చివరకు పోలీస్ కేసుల దాకా వెళ్లింది. మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదైంది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా పరువునష్టం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట మీడియా సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మంత్రి భరత్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్ల అక్రమ వసూళ్లు, అక్రమ ఆస్తులు, ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, కావాలనే తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రచారం చేశారని మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బీఎన్‌ఎస్ సెక్షన్లు 351(2), 352, 353(2), 356(1), 356(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం వ్యక్తిగత విమర్శల యుద్ధం మాత్రమే కాదు.

కర్నూలు రాజకీయాల్లో భవిష్యత్ ఆధిపత్య పోరుకు సంకేతంగా ఈ పరిణామాలను చూస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడుల అజెండాతో ముందుకెళ్తుంటే.. మరోవైపు వైఎస్సార్‌సీపీ స్థానిక సమస్యలు, బాధిత కుటుంబాల అంశాలను ఎత్తిచూపుతూ రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలో టీజీ భరత్ – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తుండగా.. కేసులు, సవాళ్లు, పోలీసులపై ఆరోపణలతో కర్నూలు రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత హాట్ టాపిక్‌గా మారాయి.