Trading | లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

Trading | లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

బ్యాంకింగ్‌, ఐటీ షేర్లపై తీవ్ర ఒత్తిడి

Trading | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ప్రారంభ ట్రేడింగ్‌లోనే బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 520 పాయింట్లు పడిపోయి 74,681 స్థాయికి చేరుకోగా.. నిఫ్టీ 50 సూచీ 150 పాయింట్లకు పైగా క్షీణించి 23,464 మార్కు వద్ద ట్రేడైంది.

మార్కెట్ పతనంలో ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఐటీ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియావంటి బ్యాంకింగ్ దిగ్గజాల షేర్లు నష్టాల్లో కొనసాగాయి. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్‌టిఐమైండ్‌ట్రీ వంటి ఐటీ కంపెనీల షేర్లు కూడా క్షీణించాయి.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా యూఎస్ బాండ్ల రాబడులు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. దీంతో ఆసియా మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి. జపాన్ నిక్కీ 1.29 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.93 శాతం మేర క్షీణించాయి.

ట్రేడింగ్ కొనసాగుతున్న సమయంలో కొన్ని ఐటీ షేర్లు స్వల్పంగా కోలుకున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లోకి రావడం కొంత ఊరటనిచ్చింది. అయితే ఆటో, ఫైనాన్షియల్ రంగాల్లో మాత్రం లాభాల స్వీకరణ కొనసాగింది. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు అగ్ర నష్టాల్లో నిలిచాయి.