ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్‌సీ విడుదల చేయాలి

ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్‌సీ విడుదల చేయాలి

చిట్యాల, ఆంధ్రప్రభ:
పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏలు), పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు కంకణాల దేవేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చిట్యాలలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అయినప్పటికీ వారికి చట్టబద్ధంగా రావలసిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.

ప్రస్తుతం సమాజంలో విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర ధరలు, కుటుంబ భారం వల్ల పెరిగిన ఆర్థిక ఒత్తిడితో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి సైతం సమయానికి రావలసిన నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమయానికి డీఏలు, పీఆర్‌సీ నివేదికలు అమలు చేయడం వారి హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేసి ఉద్యోగ వర్గాలను ఆదుకోవాలని దేవేందర్ కోరారు.

Leave a Reply