మండల కేంద్రంలో తనిఖీలు.. గ్రామాల్లో శూన్యం..

మండల కేంద్రంలో తనిఖీలు.. గ్రామాల్లో శూన్యం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ: రైతులు వానాకాలం పంటలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై దృష్టి సారించారు. ఈ కీలక సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలలో అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్ షాపుల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతుండటంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కేవలం మండల కేంద్రంలోని ఏదో ఒక ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేస్తూ సరిపెడుతున్నారని, గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపుల యజమానులపై సరైన నిఘా కొరవడటంతో ఇష్టారాజ్యంగా విత్తనాల విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు సైతం దొడ్డిదారిన సర్టిఫికెట్లు సంపాదించుకుని దర్జాగా షాపులు నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాపారులు రైతులకు పంటల సాగుపై సరైన సలహాలు ఇవ్వకపోగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన స్టాక్ రిజిస్టర్ తదితర రికార్డులను కూడా అందుబాటులో ఉంచడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల లైసెన్సులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని, నకిలీల బారిన పడకుండా రైతాంగాన్ని రక్షించాలని ఆయన కోరారు.

Leave a Reply