గన్నవరంలో సి-డాక్ కేంద్రం ఏర్పాటుపై కీలక చర్చలు..
గన్నవరంలో సి-డాక్ కేంద్రం ఏర్పాటుపై కీలక చర్చలు..
కేంద్ర మంత్రితో మాట్లాడి ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం చేస్తానని మంత్రి లోకేష్ హామీ
రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా రూ.200 కోట్ల కేంద్ర నిధులతో సి-డాక్ ప్రాజెక్టు
గన్నవరం – ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గాన్ని ఐటీ, ఉపాధి రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నారు. గన్నవరంలో ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) కేంద్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కై మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేకంగా కలిసి చర్చించారు. గన్నవరంలో సి-డాక్ బృందం పర్యటించి కేంద్రం ఏర్పాటు కోసం చర్చలు జరిపిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో స్వయంగా మాట్లాడి ప్రాజెక్టు మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలోనే 13వ సి-డాక్ కేంద్రంగా గన్నవరం ఎంపిక కానుండగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.200 కోట్ల నిధులు మంజూరు అవుతాయని తెలిపారు.
సి డాక్ ఏర్పాటు అయితే స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకుని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఎల్ఎస్ఐ వంటి ఆధునిక సాంకేతిక విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తారనీ యార్లగడ్డ తెలిపారు. భగవంతుడి దయతో, మంత్రి నారా లోకేష్ కృషితో అతి త్వరలోనే సి-డాక్ కేంద్రం గన్నవరానికి వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
