ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. కిక్కిరిసిన క్యూలైన్లు
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. కిక్కిరిసిన క్యూలైన్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏసీ రంగారావు ఆధ్వర్యంలో క్యూలైన్లను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.రద్దీ అధికంగా ఉండటంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణ భక్తులకు అమ్మవారి ముఖమండప దర్శనం కల్పించారు.
క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్‌బాబు క్యూలైన్లను పరిశీలించి, భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
