19thMayeditorial | మహిళల ఉచిత ప్రయాణం వెనుక సామాజిక లక్ష్యం

19thMayeditorial | మహిళల ఉచిత ప్రయాణం వెనుక సామాజిక లక్ష్యం

19thMayeditorial | ఉపాధిలో మహిళల పెరుగుతున్న పాత్ర
ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం
ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయం
ప్రజారవాణాను ప్రోత్సహిస్తున్న సంక్షేమ పథకం

19thMayeditorial | మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకప్పుడు ఎన్నికల నినాదం. ఇప్పుడు అది ప్రభుత్వ విధానంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఇప్పుడు కేరళ, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే, ఈ ఉచిత పథకం ఓట్ల కోసం కాదని, దీని వెనుక సామాజిక, ఆర్థిక, వివక్షా వ్యతిరేక అంశాలున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహిళల కోసం ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను వారికి కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు.

తెలంగాణలో అమలు జరుగుతున్న ఈ పథకాన్ని కేరళలో కూడా అమలు జరపనున్నట్టు సోమవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సతీశన్ ప్రకటించారు. మహిళలు గతంలో మాదిరి వంటింటికే పరిమితం కావడం లేదు. కొన్ని కుటుంబాల్లో మహిళలు సంపాదించనిదే గడవని పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఇప్పుడు పురుషులతో సమానంగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతులు ఉద్యోగాలు చేస్తున్నారు.

సామాజిక న్యాయం అన్ని స్థాయిల్లో అమలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలను గడప దాటొద్దనడం సమంజసం కాదు. స్త్రీ, పురుష భేదం లేకుండా అన్ని వర్గాలు కష్టించి పనిచేస్తేనే కానీ సంసారాలు గడవడం లేదు. అంతేకాక, మహిళలలో ఉండే శ్రమ, ఓరిమి, సహనం ఉద్యోగాల్లో వారికి అవకాశాలను ఎక్కువగా కల్పిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇప్పుడు వారికే దక్కుతున్నాయి.

బస్సుల్లో మహిళల ప్రయాణం అంటే గతంలో కూలీ పని చేసుకునే వారికే అనే అర్థం వచ్చేది. ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగాల్లో మహిళలు బాగా రాణిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది వారే. బస్సు కండక్టర్లుగా, డ్రైవర్లుగా కూడా మహిళలు రాణిస్తున్నారు.

ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు కల్పించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది ఒక ఉద్యమంగా అమలు జరుగుతోంది. నెలకు మహిళల ఖర్చుల్లో 1,500 నుంచి 2,500 రూపాయల వరకు మిగులుతోంది. ఉచిత బస్సు సౌకర్యం మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడుతోంది.

ఈ పథకాన్ని ఇప్పుడు తమిళనాడు, కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సముచిత సంక్షేమ పథకం వల్ల మహిళల ప్రయాణం సౌఖ్యవంతంగా సాగుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తుందని, అందువల్ల ఆ సంస్థకు ఎటువంటి నష్టం ఉండదని పాలకులు చెబుతున్నారు. మరోవైపు ఆక్యుపెన్సీ పెరిగి అటు ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతోంది. వాస్తవానికి ఇంధన సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు ప్రజారవాణాను ప్రోత్సహించడానికి ఇదొక చక్కటి మార్గం అని కూడా చెప్పవచ్చు.

Leave a Reply