ప్రతి ఒక్కరూ ఐక్యతగా మెలగాలి

ప్రతి ఒక్కరూ ఐక్యతగా మెలగాలి

  • నాగర్‌కర్నూల్‌లో వైభవంగా ‘బస్తీ హిందూ సమ్మేళనం’

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ:
సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యతతో మెలగాలని, హిందూ సమాజ ఐక్యత దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీలో సోమవారం నాడు ‘ఈదమ్మ గుడి బస్తీ హిందూ సమ్మేళనం’ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఓం భారత్ శక్తి పీఠం వ్యవస్థాపకులు గురూజీ భారత నంద మహారాజ్ విచ్చేశారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బిల్లకంటి భాను ప్రకాష్ రావు, కార్యదర్శి గుళ్ళ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, ముమ్మడి విజయలక్ష్మిలు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం హిందూ సమాజ ఐక్యతకు నిదర్శనమన్నారు. నేటి ఆధునిక సమాజంలో సాంఘిక విలువలతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. పుడమిని సంరక్షించడమే ధ్యేయంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే విదేశీ వస్తువుల వ్యామోహాన్ని వీడి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్వదేశీ, దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని కోరారు.

మారుతున్న జీవన శైలిలో సమిష్టి కుటుంబాల ప్రాధాన్యతను వివరిస్తూ.. సమాజంలో స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు స్పష్టం చేశారు. సమ్మేళనంలో భాగంగా కాలనీకి చెందిన చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం సమ్మేళనానికి విచ్చేసిన భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీ ఎత్తున భోజన వసతి కల్పించి, అన్నదానం నిర్వహించారు.

ఈ హిందూ సమ్మేళనంలో ఉత్సవ కమిటీ సభ్యులు శివ, సుభాష్, లక్ష్మీనారాయణ, శేఖర్ బాబు, అంజి, శ్రీను, అనిల్, నిఖిల్, వినయ్, నాగరాజు, రవి, సంతోష్, శ్రీనివాస్ రావు, నాగలక్ష్మి, ప్రసన్న, మంజుల, విజయ, కరుణాకర్, సుమన్ పట్టణానికి చెందిన వేలాది మంది భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.