బస్టాండ్ సెంటర్లో మొరముతో గుంతల మరమ్మతులు

బస్టాండ్ సెంటర్లో మొరముతో గుంతల మరమ్మతులు

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్, గ్రంథాలయం రోడ్డు, పాత హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి ప్రమాదభరితంగా తయారయ్యాయి. దీనివల్ల వాహనదారులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ప్రయాణించాలంటే పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం ప్రత్యేక దృష్టి సారించింది.

స్థానిక సర్పంచి వాసం సుస్మిత, ఉప సర్పంచి సయ్యద్ ఆరిఫ్, పంచాయతీ కార్యదర్శి వల్లాల శిరీష, కాంగ్రెస్ పార్టీ మండల కో-ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ ఆధ్వర్యంలో రహదారిపై ఉన్న గుంతలను పూడ్చే పనులను చేపట్టారు. మండల కూడలిలో నీరు నిలిచి బురదమయంగా మారిన ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లలోని గుంతలకు ట్రాక్టర్ల సహాయంతో మొరము (మట్టి) పోయించి, రోడ్డును సమతలంగా చదును చేయించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కో-ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా ఉన్న గ్రావెల్, మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రవాణాకు ఇబ్బందిగా మారిన ప్రధాన రోడ్డుకు మొరం పోయించి అత్యవసర మరమ్మతులు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు.

Leave a Reply