ప్రజలకు చేరువగా పోలీస్ సేవలు
ప్రజలకు చేరువగా పోలీస్ సేవలు
- శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
- రూ.2.75 కోట్లతో ఆధునిక భవన నిర్మాణం
- భక్తులు, మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా
- డిజిటల్ డెస్క్‌తో వేగవంతమైన సేవలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని ఉన్నతాధికారులు డిజిటల్ విధానంలో పర్యవేక్షించే వ్యవస్థను అమలు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు.
ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. శివరాత్రి వంటి ఉత్సవాల సమయంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు డిజిటల్ డెస్క్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ భవనంలో మహిళల కౌన్సెలింగ్ రూమ్ సహా అన్ని వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
