పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఎప్పుడు తగ్గిస్తారు..?

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఎప్పుడు తగ్గిస్తారు..?

మంత్రి లోకేష్‌ను ప్రశ్నించిన డాక్టర్ సునీల్ కుమార్
కాణిపాకం క్రాస్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన

చిత్తూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పూతలపట్టు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం తవణంపల్లి మండలం కాణిపాకం క్రాస్ రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తవణంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరలపై మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నెట్టేసి విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

యువగళం పాదయాత్ర సమయంలో పెట్రోల్ బంక్ వద్ద నిలబడి ధరల బోర్డులతో ఫోటోలు దిగిన నారా లోకేష్ ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. నాడు వేళెత్తి చూపిన మీరు.. నేడు కూడా చూపండి అంటూ విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని డాక్టర్ సునీల్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.113కు, డీజిల్ ధర రూ.101కు చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 వరకు అదనపు భారం మోపిందని విమర్శించారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు పెరగడంతో రైతులు, ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రవాణా రంగం పూర్తిగా కుదేలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ధరల పెంపుకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మాత్రం పెరిగిన ధరలపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ధరలు తగ్గేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకుడు బాబ్ జాన్, రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల విభాగం అధ్యక్షుడు ఎం.బి. కుమార్ రాజా, ఐదు మండలాల కన్వీనర్లు పాలేరు రామచంద్రారెడ్డి, హరి రెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే తవణంపల్లి జడ్పీటీసీ భారతి మధుకుమార్, సీనియర్ నాయకులు తలుపులపల్లి బాబురెడ్డి, రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి దోరబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అమర్నాథ్, కాణిపాకం దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, చిగరపల్లె గణేష్ రెడ్డి, ఐరాల ఎంపీపీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు సురేష్, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, తగ్గువారిపల్లె హేమచంద్ర, జయచంద్రారెడ్డి, రాజారత్నం రెడ్డి, అరగొండ కిషోర్ రెడ్డి, సుకేష్ రెడ్డి, సాయి రెడ్డి, రాజేష్ రెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు అన్ను, కార్యదర్శి రఘుపతి రాజు, భాష్యం లోకేష్ చౌదరి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శులు మునేంద్ర, సుబ్రమణ్యం, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి కోదండ, సోషల్ మీడియా అధ్యక్షుడు రెడ్డప్ప, రైతు విభాగ అధ్యక్షుడు పాలాక్షి రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షుడు మట్టపల్లె ప్రతాప్ రెడ్డి, పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామచంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.