కోడిగుడ్ల నిల్వపై డీఈవో ఫైర్!
అధిక ఇండెంట్‌పై హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు
ఏర్పేడు, ఆంధ్రప్రభ: ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థుల రోజువారీ సగటు హాజరుకు మించి కోడిగుడ్లను అధికంగా ఇండెంట్ చేసి తెప్పించడమే కాకుండా, వాటినే సుమారు నెల రోజుల పాటు నిల్వ ఉంచి విద్యార్థులకు వడ్డిస్తున్నట్లు డీఈవో పరిశీలనలో తేలింది. ఈ వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడైన ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేస్తూ, తక్షణమే పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం ఆయన 9వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారి అభ్యాస సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
డీఈవో కీలక ఆదేశాలు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రోజువారీ విద్యార్థుల సగటు హాజరును బట్టి మాత్రమే కోడిగుడ్లు, చిక్కీలకు ఇండెంట్ పంపాలని డీఈవో ఆదేశించారు. అలా కాకుండా అధికంగా ఇండెంట్ ఇచ్చి, రోజులు తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తే తీవ్రమైన అంశంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
