ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ ప్రతినిధి, మే 18: నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న గృహ నిర్మాణాల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు, లబ్ధిదారులతో కలెక్టర్ ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారురాలు గుబ్బల హేమలతకు మంజూరైన ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే గృహప్రవేశానికి సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి నిర్మాణాన్ని నాణ్యతతో పూర్తి చేసుకోవాలని తెలిపారు.

గ్రామంలో మంజూరైన ఎల్-3 కేటగిరీకి చెందిన మూడు ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణ పనుల నాణ్యత, పనుల వేగం, అవసరమైన సాంకేతిక సదుపాయాలు, పరిపాలనా అంశాలను కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఎక్కడైనా పనులు నిలిచిపోయిన పరిస్థితులు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి జాప్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామగ్రి, సాంకేతిక సహాయం, నిధుల విడుదల వంటి అంశాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ సామగ్రి కొరత, నిధుల విడుదలలో ఆలస్యం వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.

నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బలమైన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట మండల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply