ఆగ్రహించిన రైతన్నలు

ఆగ్రహించిన రైతన్నలు

వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసిన మొక్కజొన్న రైతులు
తహసీల్దార్ హామీతో విరమించిన ఆందోళన

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, తూకం చేసిన ధాన్యాన్ని తరలించడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు సోమవారం వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని ఇటీవల ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు “నిమ్మకు నీరెత్తినట్లు” వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తూకం చేసిన మొక్కజొన్న రోజులు గడిచినా తరలింపు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యపై ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ గేటుకు తాళం వేసి తమ నిరసనను తెలియజేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సైదులు మార్కెట్‌కు చేరుకుని రైతులతో మాట్లాడారు. తూకం చేసిన మొక్కజొన్నను వెంటనే తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించి గేటు తాళం తీశారు. అనంతరం తహసీల్దార్ వ్యవసాయbమార్కెట్ యార్డును పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply