ఈ-స్కూటర్‌పై కలెక్టరేట్‌కు చేరుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

ఈ-స్కూటర్‌పై కలెక్టరేట్‌కు చేరుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా వినూత్న చర్య చేపట్టారు. ప్రధాని Narendra Modi, ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ‘నో వెహికల్ డే’ను పాటిస్తూ ఆయన స్వయంగా ఈ-స్కూటర్‌పై కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
సోమవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ వచ్చిన కలెక్టర్ అనంతరం అక్కడ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా అధికార వాహనాలను వినియోగించే ఉన్నతాధికారులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు వారంలో కనీసం ఒకరోజైనా వ్యక్తిగత వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని సూచించారు.
భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హితమైన రవాణా విధానాల వైపు ప్రజలు మళ్లాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతోందన్నారు. కలెక్టర్ స్వయంగా ఈ-స్కూటర్‌పై కార్యాలయానికి రావడం కలెక్టరేట్ సిబ్బంది, ప్రజల్లో ఆసక్తి రేకెత్తించింది. ఆయన చర్యను పలువురు అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ఇది మంచి సందేశమని పేర్కొన్నారు.
