కిరికెర బసవన్నపల్లిలో విషాదం

కిరికెర బసవన్నపల్లిలో విషాదం

  • చెరువు కుంటలో లభ్యమైన ఐదేళ్ల చిన్నారి మృతదేహం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర బసవన్నపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఐదేళ్ల చిన్నారి శ్రీవల్లి మృతదేహం ఇంటి సమీపంలోని చెరువు కుంటలో గురువారం లభ్యమైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శ్రీవల్లి రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా కనిపించకుండా పోయింది. చిన్నారి ఆచూకీ కోసం బంధువులు, గ్రామస్తులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా గ్రామ పరిసర ప్రాంతాల్లో, చెరువులు, పొలాలు, ఇతర ప్రాంతాల్లో శోధన నిర్వహించారు.

అయితే గురువారం ఉదయం ఇంటి సమీపంలోని చెరువు కుంటలో చిన్నారి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీవల్లి కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. గ్రామస్తులు కూడా చిన్నారి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. చిన్నారి చెరువు కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply