పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ బైక్‌ ర్యాలీ

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ బైక్‌ ర్యాలీ

ఆదోని, ఆంధ్రప్రభ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలో భారీ మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్‌, యువ నేత మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వందలాది మోటార్‌సైకిళ్లతో ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ర్యాలీలో వైసీపీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply