చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు

  • గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
  • కమిషనరేట్ పరిధిలో 6 చెకోపోస్టుల ఏర్పాటు
  • కరీంనగర్ సిపి గౌష్ ఆలం

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని, గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలమ్ పేర్కొన్నారు. రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్, గోరక్ష ప్రముఖ్ తదితర హిందూ మత సంఘాల ప్రతినిధులతో కరీంనగర్ పోలీస్ కవి షనర్ గౌష్ ఆలం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పండుగ వేళ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చె శారు.

పశువుల అక్రమ రవాణా లేదా గోవధకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, తక్షణమే పోలీసులకు తెలియజేయాలే తప్ప చట్టాన్ని ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. అలా కాదని చట్టాన్ని అతిక్రమిస్తే తెలంగాణ గోవధ నిషేధ, జంతు సంరక్షణ చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.

కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా 6 చోట్ల చెకోపోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. కరీంనగర్ రూరల్ లోని ముగ్ధంపూర్, కరీంనగర్ కొత్తపల్లి మండలం చింతకుంట, చొప్పదండి మండలం ఆర్నకొండ, గంగాధర మండలం తుర్కాసినగర్, తిమ్మాపూర్ మండలం రేణికుంట, హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్డు వద్ద చెక్ పోస్టులు ఉంటాయన్నారు. చెకోపోస్టుల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సరిపడా పోలీసు సిబ్బందిని కేటాయించామని, రానున్న రెండు వారాలపాటు నిరంతరం మరింత పటిష్ట భద్రతను కొనసాగిస్తామని సీపీ తెలిపారు. చెకోపోస్టుల వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు.