శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి
తిరుమల, ఆంధ్రప్రభ : రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం తిరుమలలో సాధారణ భక్తులకు కేటాయించే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.
సాధారణంగా రాష్ట్ర మంత్రులకు వీఐపీ బ్రేక్ దర్శనం సౌకర్యం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని రకాల బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. దీంతో ప్రతిరోజూ మరింత ఎక్కువ సంఖ్యలో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది.
ఈ నేపథ్యంలో తన మనవరాలి కేశకండన కార్యక్రమం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన మంత్రి పార్థసారథి, సాధారణ భక్తుడిలా రూ.300 టికెట్ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
