ఘోరం.. బాలికపై బాబాయి అఘాయిత్యం

ఘోరం.. బాలికపై బాబాయి అఘాయిత్యం

  • బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడి
  • న్యూడ్ ఫోటోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపు
  • వేసవి సెలవుల్లో తిరుపతికి వచ్చిన బాలికపై దారుణం
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • నిందితుడి కోసం గాలింపు చేపట్టిన ఈస్ట్ పోలీసులు

తిరుపతి క్రైమ్ (ఆంధ్రప్రభ): తిరుపతిలో మైనర్ బాలికపై బంధువే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన వి.సాయిలక్ష్మి, ఆమె భర్త వి. రమేష్ దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాక వేసవి సెలవుల కోసం తిరుపతిలో నివసించే ఆమె సొంత చెల్లెలు మానస ఇంటికి బాలిక వచ్చింది. ఈ సమయంలో బాలికకు బాబాయిగా వరుసయ్యే రామమూర్తి, బాలికకు సంబంధించిన కొన్ని న్యూడ్ ఫోటోలు తన సెల్‌ఫోన్‌లో ఉన్నాయని చెప్పి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోకపోతే ఆ ఫోటోలను వాట్సాప్‌లో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై మొదట హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసును తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 64(2), 64(2)(ఎం)తో పాటు పోక్సో చట్టం 5(1), 5(ఎన్) రెడ్‌ విత్ 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిందితుడు రామమూర్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. మైనర్ బాలికలను ఇతర ప్రాంతాలకు పంపేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.