717 TASMAC |వారికి నో లిక్కర్

717 TASMAC | వారికి నో లిక్కర్


717 TASMAC | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్ల సమీపంలోని 717 టాస్మాక్ షాపులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో చర్చనీయాంశమైంది.

సీఎం ఆదేశాల మేరకు గుడులు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ టెర్మినల్స్‌కు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను రాబోయే రెండు వారాల్లో పూర్తిగా మూసివేయనున్నారు. ఇందులో ప్రార్థనా స్థలాల సమీపంలోని 276 షాపులు, విద్యాసంస్థల దగ్గర ఉన్న 186 షాపులు, బస్ స్టాండ్ల సమీపంలోని 255 షాపులు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న 21 ఏళ్ల మద్యం సేవన వయస్సును కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మద్యం కొనుగోలు చేసే వారి వయస్సుపై అనుమానం ఉంటే గుర్తింపు కార్డులు తనిఖీ చేయాలని, 21 ఏళ్లలోపు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్న మద్యం దుకాణాల పని వేళలను రాత్రి 8 గంటలకే పరిమితం చేసే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.