“వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమం..

“వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమం..

చిలకలూరిపేట (నాదెండ్ల), ఆంధ్రప్రభ: నాదెండ్ల మండలం గురిజవోలు గ్రామంలో గురువారం నిర్వహించిన “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి రెవెన్యూ, సర్వే సంబంధిత అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కార దిశగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంబంధితంగా ప్రజల నుంచి 11 అర్జీలు అందినట్లు వెల్లడించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా అధికారులను కలుసుకునే అవకాశం లభిస్తుందని, ఫిర్యాదులను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామంలోని సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా సర్వే అధికారి భాను కీర్తి, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.