జై బోలో వీర హనుమాన్ నినాదాలతో దద్దరిల్లిన నేరేడుచర్ల

జై బోలో వీర హనుమాన్ నినాదాలతో దద్దరిల్లిన నేరేడుచర్ల
నేరేడుచర్ల మే 12 (ఆంధ్రప్రభ) : జై బోలో వీర హనుమాన్ కి.. పవనసుత హనుమాన్ కి జై , జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్, జై భజరంగ్ భళి నినాదాలతో నేరేడుచర్ల పట్టణ వీధులు దద్దరిల్లాయి. కాషాయ జెండాలతో వీధులన్నీ కళకళలాడాయి. మంగళ వారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ కోదండ రామాలయం నుండి కాషాయ జెండాలు చేతబూని ద్విచక్ర వాహనాలతో పట్టణంలోని పలు వీధుల్లో సాగిన భక్తుల ర్యాలీ ఆద్యంతం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. స్థానిక శ్రీ కోదండ రామాలయంలో, అన్నపూర్ణ విశ్వేశరాలయంలో, పాత నేరేడుచర్లలో, హుజూర్నగర్ రోడ్డులోని పాత రామాలయంలో ఆలయ పూజారులు కొలచిన దిలీప్ కుమార్ శర్మ, ఓంకార్,లక్ష్మీ నరసింహ చార్యులు, ఆమంచి ఉపేందర్ శర్మల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం అనంతరం నూతన వస్త్రాలు,తమల పాకులతో స్వామివారిని అలంకరించారు.
సహస్రనామార్చన, మహా నివేదన, నీరాజనం, ఆకుపూజ, మంత్ర పుష్పములు వేద మంత్రాల తో, సాంప్రదాయ సిద్ధంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు. పాత నేరేడుచర్ల లో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్ లు కొణతం సత్యనారాయణ రెడ్డి, రాచకొండ రామ కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్ రెడ్డి, కౌన్సిలర్లు యారవ లక్ష్మి, ఇంజమూరి శ్రీకాంత్, తాళ్ల లావణ్య, కో ఆప్షన్ సభ్యురాలు పొనుగోటి శోభ జంగారావు తదితరులు పాల్గొన్నారు.
