ఘనంగా పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని మొర్రిగూడెం గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి సహిత పోతరాజుల స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ మహోత్సవాలకు వైదిక నిర్వహణను శ్రీమన్ నేరెళ్ల నరసింహమూర్తి, నేరెళ్ల సందీప్ ఆచార్య (పాండవపూర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో విగ్రహ శోభాయాత్ర, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ పూజ, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ, సర్వవైదిక హోమం, వాస్తు హోమం, ఆలయ పర్యాగ్నికరణం, తీర్థప్రసాదం, మండపారాధన, స్థాపిత దేవత హోమం, జలక్షీరాదివాస హోమం, ఆదివాసం తదితర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి, ఉపసర్పంచ్ తక్కల రమ్య-రవీందర్, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
