రైతు కన్నీళ్లు పెట్టినా.. కనీస కనికరం లేదా..?
రైతు కన్నీళ్లు పెట్టినా.. కనీస కనికరం లేదా..?
- కాంగ్రెస్ వాళ్లే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తుండ్రు
- వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు అసలు పట్టింపే లేదు
- సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవినీతి వల్లే రైతులు బలి
- దుబ్బాక ఎమ్మెల్యే కేపీఆర్‌తో కలిసి మాజీ మంత్రి పర్యటన
- కొనుగోలు కేంద్రాల్లో రైతుల దుస్థితిపై హరీశ్‌రావు ఆగ్రహం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి హరీశ్ పర్యటించారు. కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి వడ్లతో పడిగాపులు కాస్తున్న రైతుల పరిస్థితిని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీశ్‌రావు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, అయినా కనీస కనికరం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. కర్ణాల్‌పల్లి కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు గడిచినా ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే రావడం దారుణమన్నారు. 10 రోజులకు ఒక లారీ వస్తే రైతుల వడ్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ వడ్ల కొనుగోళ్లపై ఒక్కసారి కూడా కలెక్టర్లతో సమావేశం నిర్వహించలేదని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలు తప్ప రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఆరోపించారు.
ఏసీ గదుల్లో కూర్చొని అబద్ధాలు..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏసీ గదుల్లో కూర్చొని అబద్ధాలు చెబుతున్నారని, ఒకసారి కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తే రైతుల బాధలు తెలుస్తాయని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొందంటే ప్రభుత్వ వైఫల్యం ఎంత తీవ్రమో అర్థమవుతుందన్నారు. మక్కలు, శనగలు, సన్‌ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
35 రోజులుగా సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి కారణంగానే ఆ సంస్థ ఆర్థికంగా దెబ్బతిందని, దాని ప్రభావం రైతులపై పడుతోందని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పురుగులు పట్టి పాడవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చేగుంట మండలంలోని పది గ్రామాల్లో వడగండ్ల వాన వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే లారీలు పంపించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టరేట్ల ముట్టడికి దిగుతామని హెచ్చరించారు.
