మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : మే 10న హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోవు మోడీ భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు, సీనియర్ నాయకులు జన సమీకరణ ఇన్చార్జి అమర్నాథ్ సారంగుల పిలుపునిచ్చారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో మే 10న హైదరాబాద్లోని ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రతినిధులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అమర్నాథ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పట్ల రాష్ట్రంలోని రైతులు, యువత, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆక్రోషంతో ఉన్నారని, అన్ని రంగాలలో పాలన కుంటు పడిందని అన్నారు. ఈ ప్రాంతం ముద్దు బిడ్డనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ పాఠశాలలలో విద్యను బలోపేతం చేస్తానని మాటలకే పరిమితమయ్యారని, జూలై 2025లో యంగ్ ఇండియా స్కూల్ ను శంకుస్థాపనకే పరిమితం చేశారని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఒకనాడు ఎంతోమంది విద్యావేత్తలను అందించిన పాలెం కాలేజీ నేడు రేకుల షెడ్డు కే పరిమితమై దీనమైన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలను అన్ని రంగాలలో దారుణంగా మోసం చేశారని, ఆజ్ బెంగాల్ – కల్ తెలంగాణ నినాదంతో వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ను కుక్కుటి వేళ్ళతో పెకిలించిన మాదిరిగానే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. డి-లిమిటేషన్, మహిళా బిల్లును ఆపడం ఎవరి తరము కాదని రాబోయే రోజులలో కచ్చితంగా నరేంద్ర మోడీ హాయంలోని భాజపా ప్రభుత్వం సాధించి తీరుతుందని దానిని ఆపడం రాహుల్ తరం కాదని అన్నారు.

భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ధన ధాన్య యోజన పథకం కింద ఒక నాగర్కర్నూల్ జిల్లాకే 240 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, మొక్కజొన్న రైతులకు 2,400 కనీసం మద్దతు ధర కల్పించిన గాని నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 1,700 రూపాయల మద్దతు ధర కూడా కల్పించడం లేదని అన్నారు. మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో 7,853 కోట్ల విలువైన జోగులాంబ, గద్వాల్ ,మల్కాపూర్, ఆఫీస్ పేట, చెర్లపల్లి ప్రాంతాలలో పలు ప్రాజెక్టులతో పాటు అనేక రహదారులను జాతికి అంకితం చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు.

భారతదేశ విచ్ఛిన్నం కొరకు కాంగ్రెస్ పార్టీ డి-లిమిటేషన్ , మహిళా బిల్లు, ఆదివాసీలను మోసగించడం జరిగిందని అన్నారు. శ్యామా ప్రసాద్ పుట్టిన గడ్డపై కాషాయం జండా రెపరెపలాడిన విధంగానే, వెస్ట్ బెంగాల్ లో భాజాపను ఆదరించిన విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపుతున్నారని, మహిళా వ్యతిరేకం ప్రజాస్వామ్యంకుని గుండాయిద్యాన్ని అంతం చేసినట్టుగానే తెలంగాణలో పునరావృత్తమయ్యేలా నేడు యువత దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుందని రాబోయే ఎన్నికలలో 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం తత్తేమని అన్నారు.

తెలంగాణ మలిదశ పోరాటంలో అమరుల త్యాగాలను ఒక రాజకీయ పార్టీ తన ఖాతాలో జమ చేసుకున్నదని, నేడు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకుంటుందని, మే 10న జరిగే మోడీ బహిరంగ సభకు అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని రంగాలలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని, అందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోడీ సందేశాన్ని గడప గడపకు తీసుకుపోయేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ లో పాల్గొని వాళ్ళు పెయింటింగ్ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మంగ్య నాయక్, మండికారి బాలాజీ, ముక్తాల రేనయ్య, అన్ని మండలాల ప్రతినిధులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.