వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ
వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ
- అతి త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు విడుదల
- విద్యా, వైద్య, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం
- బాలసదనాలను ప్రభుత్వ, సీఎస్సార్ నిధులతో అభివృద్ధి చేస్తాం
- అంగన్వాడీలను, బాల సదనాలను కాపాడుకునే గురుతర బాధ్యత ప్రభుత్వానిధి
- అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణం, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి
- వికలాంగులకు స్కూటీల పంపిణీ
- నారాయణఖేడ్ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు . త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బాలసదనంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. బాల సదనం నూతన భవనాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా, వైద్య, మహిళా సాధికారత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు. మహిళా, శిశు , వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా బాల సదనాలను, అంగన్వాడీలను కాపాడుకునే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ, సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా గర్భిణీ, బాలింతలకు, 3 నుండి 6 ఏండ్ల పిల్లలకి ఒక పూట సంపూర్ణ భోజనం, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందించడం, మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించడంతోపాటు పోషకాహారం, ఆరోగ్యం , ప్రీ – స్కూలు, రోగ నిరోధకత, రిఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాలలో ఏ ఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా వీరి సేవలను మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బాలసదనం బాలికలతో మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో తక్షణమే ఆర్ఓ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు , వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారోత్సవాలలో జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ శుభ్రత, 18 సంవత్సరాల పైబడిన సిసిఐ పిల్లలను గుర్తించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించుట, అత్యవసర సర్టిఫికెట్లు ఆరోగ్య కార్డుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం, సంస్థల నుండి పిల్లలను బయటికి డిశ్చారీ చేసి తిరిగి వారికి పునరావాస కల్పించుట మరియు ఫాలో అప్ ప్రక్రియ, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పు ప్రక్రియ లాంటివి జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సీడీపీఓ సుజాత, ఆశ్రమ నిర్వాహకురాలు విజయ కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
