TRS Flag Festival I ఉద్యమాలకు పురిటిగడ్డ సంగారెడ్డి
TRS Flag Festival I ఉద్యమాలకు పురిటిగడ్డ సంగారెడ్డి
- ‘పంచజన్యం’ పేరుతో ఉచిత విద్య, వైద్యం అందిస్తాం
- హామీలను అమలు చేయకపోతే రాళ్లతో కొట్టండి
- జెండా పండుగలో టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- మాజీ మంత్రి హరీష్, జిల్లా మంత్రి దామోదర్ పై ఘాటు విమర్శలు
- కలబ్ గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ
TRS Flag Festival I సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి ఉద్యమాలకు పురిటిగడ్డ అని, భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేత నవీన్ ఆచారి, పార్టీ సంగారెడ్డి ఇన్చార్జి కులం దయాకర్ రెడ్డి, సంఘమిత్ర, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సంగారెడ్డి చరిత్రను తెలుసుకోవాలి
సంగారెడ్డి గడ్డపై పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని కవిత అన్నారు. ఈ ప్రాంతానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, దానిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు చరిత్ర లేదని చేసిన వ్యాఖ్యలకు శిలాశాసనాలు, దేవాలయాలను చూపిస్తూ సమాధానం ఇచ్చామని గుర్తు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో సదాశివపేటలో కాల్పులు జరిగాయని, ఉద్యమాలకు సంగారెడ్డే తొలి అడుగు వేసిందని తెలిపారు.
ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి
సంగారెడ్డి రాజకీయాల్లో ఫిక్సింగ్ రాజకీయాలు కొనసాగుతున్నాయని కవిత విమర్శించారు. జగ్గారెడ్డి, హరీష్ రావు, దామోదర రాజనర్సింహ, చింతా ప్రభాకర్, రఘునందన్ రావు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల విషయంలో ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నాయకులు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
సింగూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు
తెలంగాణ రాష్ట్ర సాధన నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని కవిత అన్నారు. 15 సంవత్సరాలుగా సింగూరు ప్రాజెక్టు కుంగిపోతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తూ వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా ఈ అంశంపై శ్రద్ధ చూపలేదన్నారు.
అభివృద్ధి, భూ వ్యవహారాలపై విమర్శలు
దామోదర రాజనర్సింహ బావమరిది 200 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని కవిత ఆరోపించారు. జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం డీపీఆర్‌లలో ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ అంశంపై రఘునందన్ రావు సహా ఇతర పార్టీల నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కీలక హామీలు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘పంచజన్యం’ పేరుతో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందిస్తామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల భారం పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి కారణంగా పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తెల్లాపూర్ శిలాశాసనం వద్ద తనను కట్టేసి రాళ్లతో కొట్టాలని సవాల్ విసిరారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ కలబ్ గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జెండా పండుగ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ బాలయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కరుణాకర్, నితిన్, శ్రీకాంత్, కేడీఆర్ యువసేన అధ్యక్షుడు గోపాల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు, యువత పాల్గొన్నారు. జెండాలు, నినాదాలతో సంగారెడ్డి కేంద్రం సందడిగా మారింది.

