Road safety india | ప్రభుత్వాల నిర్లక్ష్యం పై ప్రజల ఆవేదన

Road safety india | ప్రభుత్వాల నిర్లక్ష్యం పై ప్రజల ఆవేదన

Road safety india | ప్రభుత్వాల నిర్లక్ష్యం పై ప్రజల ఆవేదన
రోడ్ల డిజైన్ లో లోపాలు – ప్రధాన కారణం
సుప్రీంకోర్టు హెచ్చరిక – జీవించే హక్కు ప్రమాదంలో
సాంకేతిక పరిష్కారాలు – భద్రతకు కొత్త మార్గం
అవగాహన, శిక్షణతోనే మార్పు సాధ్యం
క్రమబద్ధ చర్యలతో రోడ్లు పూలబాటలు

Road safety india | రహదారుల మీద ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి! అత్యాధునికతను సంతరించుకుని సాంకేతికంగా ఒక స్థాయిలో ఉన్న మన దేశం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రమపద్ధతిలో విస్తరించడమే కాకుండా చెక్‌పోస్టుల ద్వారా కొంత నియంత్రణను సాధిస్తున్న రోజుల్లో కూడా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదని, ప్రజలు, రోడ్డు ప్రయాణీకులు వాపోతున్నారు.

నూతన వధూవరులు పసుపు పారాణి ఆరకమునుపే రోడ్డు ప్రమాదాల్లో నిండు జీవితాలను కోల్పోవడం, అందర్నీ కలచివేస్తోంది. లోలోపల భరించలేని బాధకు కారణమవుతోంది. ఇలాంటి సంఘటనలు వినిపించినప్పుడే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దేశమంతటా రోడ్డు ప్రమాదాల్లో బస్సు ప్రయాణీకులు మృతులుగా మారడం రోజురోజుకూ ఖేదాన్ని పెంచుతోంది. విమానాలు, రైలు ప్రయాణాల్లో ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతున్నా, రోడ్లపై ప్రమాదాలు మాత్రం నిమిషానికోసారి జరుగుతున్నాయన్న భావన కలుగుతోంది. ఈ పరిస్థితులను ఎత్తి చూపుతూ ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు తక్షణ నివారణ చర్యలు తీసుకుని రోడ్డు ప్రయాణాలను ప్రమాదరహితంగా మార్చాలని ఆశించడం తప్పు కాదు.

రాష్ట్రాల్లో గానీ, కేంద్ర ప్రాంతాల్లో గానీ రోడ్ల డిజైన్లు సరిగా లేకపోవడాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. రూటింగ్‌తో పాటు వేగ నియంత్రణకు సరైన చర్యలు అమలు కావడం లేదు. మన రోడ్లు ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కార్లు, సైకిళ్లు, పాదచారులతో అడ్డదిడ్డంగా నిండిపోతున్నాయి. స్మార్ట్ సిటీల పేరుతో ఉన్న పెద్ద పట్టణాల్లో కూడా ‘స్మార్ట్‌నెస్’ కనీసం కనిపించని పరిస్థితి ఉంది.

అయితే ఇతర దేశాల్లో అనుభవంతో రూపొందించిన పలు రోడ్డు భద్రతా పద్ధతులు అమలులో ఉన్నాయి. అలాంటి పద్ధతులను మన దేశంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా వ్యవహరించి (2025, 2026 సంవత్సరాల్లో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని) ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించడం గమనార్హం. రహదారి ప్రమాదాలను నివారించకపోవడం వల్ల రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు దెబ్బతింటోందని కోర్టు వ్యాఖ్యానించింది.

వాహనం-వాహనం కమ్యూనికేషన్‌ (Vehicle-to-Vehicle Communication) వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఇతర దేశాలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ సాంకేతికత ద్వారా వాహనాల స్థానం, రహదారిపై కదలికలు వంటి వివరాలు తెలుసుకోవడంతో రోడ్డు భద్రత మెరుగుపడుతోంది. భారతదేశంలో కూడా ఈ సాంకేతికతను అమలు చేయగలిగితే పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే దీనికి తగిన సాంకేతిక నైపుణ్యం, అవగాహన అవసరం.

ఈ విధానాలను అమలు చేయడానికి ముందు వాహనదారులకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలి. సాంకేతిక పద్ధతులను సులభంగా అర్థమయ్యేలా ప్రజల్లో ప్రచారం చేయాలి. వాహన లొకేషన్ ట్రాకింగ్ డివైసులు, హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వంటి పరికరాలను సబ్సిడీల ద్వారా అందుబాటులోకి తీసుకురాగలిగితే వినియోగదారులు సులభంగా స్వీకరిస్తారు. ఎక్కువ మంది ఈ సాంకేతికతను ఉపయోగిస్తే ఖర్చు కూడా తగ్గుతుంది.

ప్రభుత్వాలు విస్తృత ప్రచారంతో పాటు సబ్సిడీలు, సంక్షేమ పథకాల ద్వారా ఈ చర్యలను అమలు చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. అలా చేస్తే రాజ్యాంగం కల్పించిన ‘జీవించే హక్కు’ను నిజంగా అమలు చేసినట్లవుతుంది.

ఇప్పుడు అవసరమైంది సంబంధిత మంత్రులు, అధికారులు భారతదేశంలోని రహదారులను ప్రమాదరహితంగా మార్చేందుకు క్రమబద్ధమైన చర్యలు తీసుకోవడం. రోడ్లను బాగుచేయడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి చర్యలను దశలవారీగా అమలు చేస్తే రహదారులు నిజంగా పూలబాటలుగా మారే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రభుత్వాల అత్యంత ముఖ్య బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా కేవలం జరిమానాలు విధించడం, క్లాసులు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అలా చేస్తే పరిస్థితులు మారవు.

— రావులపాటి సీతారాంరావు