6thMaychintana | కోడి నేర్పే జీవిత పాఠాలు
6thMaychintana | కోడి నేర్పే జీవిత పాఠాలు
6thMaychintana | కోడి చెప్పే క్రమశిక్షణ పాఠం
బ్రాహ్మ ముహూర్తం ప్రాధాన్యం
సమయ విలువ – జీవిత సత్యం
స్వార్జితం, తృప్తి జీవనం
అప్రమత్తత, ధైర్యం అవసరం
కుటుంబ బంధాల ప్రాముఖ్యత
కోడి నుండి స్ఫూర్తిదాయక సందేశాలు
6thMaychintana | సృష్టిలోని ప్రతి ప్రాణికీ తనదైన ఒక ప్రత్యేకత ఉంది. నేర్చుకోవాలనే మనసుంటే ప్రతి జీవి మనకు కొన్ని జీవిత పాఠాలను నేర్పిస్తుంది. నెమలి వంటి అందం, కోయిలలాంటి కంఠం లేకపోయినా, కోడి వంటి సామాన్య ప్రాణి కూడా మనకు ఎన్నో విలువైన పాఠాలు బోధిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవేంటో తెలుసుకుందాం.
కోడి నుండి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం వేకువ జాముననే నిద్రలేవడం. సూర్యోదయానికి రెండు గంటల ముందు, అంటే ఉదయం 04.00 గంటల నుండి 05.30 వరకు ఉండే పవిత్రమైన సమయం, ‘బ్రాహ్మ ముహూర్తం’ అంటారు. మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వలన —
“వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్థ్యమాయుశ్చ విందతి,
బ్రాహ్మ ముహూర్తే యో జాగ్రత్ తవ పంకజమేవ చ” —
అందం, మేధస్సు, సంపద, ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్ఠలు సూర్యోదయానికి ముందే లేచినవారికి కమలం వికసించినట్లుగా వచ్చి చేరుతాయట.
ఆ సమయానికి ఈ సృష్టిలో తాను లేవడమే కాక, లోకాన్నంతటినీ తన కూతతో మేలుకొలిపే ప్రాణి కోడి. ఏ ఒక్క రోజూ అది బద్ధకించదు. క్రమశిక్షణకు మారుపేరు అయిన కోడి తనలాగే అందరూ క్రమశిక్షణను పాటించాలని, తెల్లవారుజాముననే నిద్రలేవాలని, సమయపు విలువను గ్రహించాలని తన కూతతో లోకాన్ని జాగృతం చేస్తుంది.
ఎంతో అమూల్యమైనది, ఎంత శ్రమించినా తిరిగి రానిది సమయం. మన ఆయుర్దాయం క్షణికం. నిద్రమత్తులో మునిగి సమయాన్ని వ్యర్థపరచకుండా త్వరగా లేచి తమ తమ విధుల్లో నిమగ్నులవ్వాలని తన కూతతో కోడి లోకానికి సందేశం ఇస్తుందని దువ్వూరి రామిరెడ్డి అన్నారు. ఇప్పటిలా గడియారాలు లేని పూర్వకాలంలో కోడి కూతే అలారం మోతగా ఉండేది.
ఇంద్రుడు తెల్లవారుజాము కాకముందే గౌతముని ఆశ్రమం ముందు కోడి రూపంలో కూసి తెల్లవారినట్లు నమ్మించి, గౌతముడు నదీ స్నానానికి వెళ్లిన తర్వాత ఆ ఋషి రూపంలో అహల్యతో గడపడం, అనంతరం గౌతముని చేత శపించబడడం రామాయణంలోని ప్రసిద్ధ గాథ. కోడి కూతతోనే ఆ కాలంలో లోకం చైతన్యవంతమయ్యేది.

స్వార్జితంతో జీవించడం మనం కోడినుండి నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. ఎంతో శ్రద్ధగా, కష్టపడి ఆహారాన్ని వెదికి సంపాదించుకుంటుంది కోడి. తనకు లభించిన దాన్ని తన పిల్లలతో, బంధుమిత్రులతో పంచుకుని తృప్తిగా జీవిస్తుంది. తనకు అవసరమైనంత ఆహారం లభించాక ఇంకా దాచుకోవాలనే అత్యాశ చూపదు. కష్టపడి పనిచేసి తనను, తనవారిని పోషించుకోవడంలో ఉన్న తృప్తి పరులపై ఆధారపడితే లభించదని తన జీవన విధానంతో కోడి మనకు చెబుతోంది.
అనుక్షణం ప్రమాదభరితమైన ఈ లోకంలో నిరంతరం అప్రమత్తంగా జీవించాలనేది మనకు కోడి నేర్పే మూడవ పాఠం. కోడి ఎప్పుడూ మేల్కొని ఉంటుంది. కన్ను మూసినా తరచుగా పరిసరాలను గమనిస్తూ, ఏ చిన్న అలికిడైనా అప్రమత్తమై తనను, తన పిల్లలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆపదలకు, శత్రువులకు, పోరాటాలకు భయపడదు. ధైర్యసాహసాలతో పోరాడుతుంది. గాఢనిద్ర పట్టనివారిని “కోడి నిద్ర” అంటారు. రోషానికి, పౌరుషానికి కోడి పుంజులు ప్రసిద్ధి. కోడి పందేలలో ప్రాణం పోయే వరకు పోరాడే కోళ్ళు ధైర్యానికి ప్రతీకలు.
ఆధునిక కాలంలో మనుషులు కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారు. కానీ కోళ్ళు అలా కావు. కోడి పుంజు తన భాగస్వామితో, పిల్లలతో మంచి అనుబంధం కలిగి ఉంటుంది. పెట్ట కోడి గుడ్లను పొదిగి పిల్లలను తన వెంట తీసుకెళ్తుంది. తన పిల్లల జోలికి వచ్చిన ఎంత పెద్ద జంతువునైనా ఎదుర్కొని వాటిని కాపాడుతుంది. కుటుంబ బంధాలను నిలుపుకోవడం కోడినుండి నేర్చుకోవాల్సిన నాలుగవ పాఠం.
పగలంతా ఎక్కడ తిరిగినా సాయంత్రానికి తన నివాసానికి చేరుకోవాలని కోడి మనకు తెలియజేస్తుంది. అల్పజీవి అయినా అనంతమైన స్ఫూర్తిని అందిస్తుంది. క్రమశిక్షణకు మారుపేరైన కోడి పట్ల అభిమానంతో కుమారస్వామి తన జెండాపై కోడిని నిలిపి ‘కుక్కుటధ్వజుడు’గా ప్రసిద్ధి పొందాడు.
“కొక్కొరోకో” అని కూయడం వల్ల కోడికి కుక్కుటం, కృకవాకము అనే పేర్లు వచ్చాయి. కోడి కూతను “కృకవాకకూజితం” అంటారు. ఎర్రని జుత్తు తలపై ఉండటం వల్ల కోడిని తామ్రచూడమని కూడా అంటారు. కాళ్లను ఆయుధాలుగా ఉపయోగించడం వల్ల కోడికి “చరణాయుధం” అనే పేరు వచ్చింది.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
