ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనకు సమన్వయంతో కృషి చేయాలి..
ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనకు సమన్వయంతో కృషి చేయాలి..
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆశించిన పురోగతి లేదు..
సేవా రంగం పనితీరు తక్కువ… మెరుగుదలపై దృష్టి అవసరం…
వృద్ధిరేటును రూ. 50,711 కోట్లకు పెంచే లక్ష్యం…
తలసరి ఆదాయం పెంపుకు శాఖల సమిష్టి కృషి అవసరం..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా మానవ వనరుల కేంద్రంలో ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సుమారు రూ.20,395 కోట్ల ఆదాయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.
ఇందులో ఉద్యానవనం 37%, పశుసంవర్ధక శాఖ 32%, వ్యవసాయం 21%, మత్స్యశాఖ 4%, అటవీశాఖ 3% వాటా కలిగి ఉన్నాయని వివరించారు. గత సంవత్సరం రు. 16,000 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఈ సంవత్సరం లక్ష్యం పెంచినప్పటికీ, ప్రస్తుతం సాధన ఆశించిన స్థాయిలో లేదని, కేవలం సుమారు 9.88% వృద్ధి మాత్రమే నమోదైందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో 2024-25లో రూ. 7,894 కోట్ల ఆదాయం సాధించగా, 2025-26లో రూ.13,286 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, గనులు మరియు విద్యుత్ రంగాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పరిశ్రమల అభివృద్ధి సక్రమంగా లేకపోతే జిల్లా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. సేవా రంగానికి సంబంధించి 2024-25లో రూ.17,999 కోట్ల సాధనతో 11.77% వృద్ధి నమోదు చేసినప్పటికీ, ఇతర రంగాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. రాబోయే ఏడాదిలో కనీసం 15% వృద్ధిని సాధిస్తూ రూ. 20,800 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి (GDDP)ను 2024-25లో రూ. 43,694 కోట్ల నుండి 2025-26లో రూ. 50,711 కోట్లకు పెంచాలని, తలసరి ఆదాయాన్ని రు.
2,05,327 నుండి రు. 2,35,209కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వృద్ధి రేటు 10% వద్దే ఉండటం గమనార్హమని, నిర్దేశించిన 15% లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని శాఖలు మరింత కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కీలక పనితీరు సూచికల (KPIs) నమోదు విషయంలో నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు అదే సంవత్సరంలో నమోదు కావాలని, ఆలస్యం చేస్తే అవి పాత లెక్కల్లోకి వెళ్లిపోతాయని తెలిపారు.
వివిధ శాఖలకు కేటాయించిన గ్రేడింగ్‌లో బి-గ్రేడ్ మరియు సి-గ్రేడ్ వచ్చిన విభాగాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పంట బీమా, ఉత్పాదకత, కౌలు రైతులకు రుణాలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు, పోలీసు శాఖలో కేసుల పరిష్కారం వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరగడం అత్యంత ముఖ్యమని, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కనీసం 80% దాటేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రస్తుతం కొన్ని శాఖల్లో ప్రజల అసంతృప్తి అధికంగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో శుభ్రత, మౌలిక సదుపాయాలు, సేవల నాణ్యత మెరుగుపరచడంలో సంబంధిత అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్షలో జిల్లా స్థానం మెరుగుపడేలా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని, లక్ష్య సాధనలో ఎటువంటి రాజీ ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
